ఏడవ వేతన సంఘం - జీతాల పెరుగుదలకు వ్యతిరేకం
కేంద్ర
ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను పెంచటాన్ని ఏడవ వేతన సంఘం తీవ్రంగా
వ్యతిరేకిస్తున్నది. స్వాతంత్య్రానంతరం నియమింపబడిన ఏ వేతన సంఘం కూడా ఈ
విషయంలో ఇంతగా లోభితనం ప్రదర్శించలేదు. ఆరవ, ఏడవ వేతన సంఘాలను స్థూలంగా
పోల్చి చూసినప్పుడు వేతనాల పెరుగుదలపట్ల ఏడవ వేతన సంఘానికి వ్యతిరేకత ఎంత
తీవ్రంగా వున్నదో తెలుస్తుంది.
1995-96, 2005-06 మధ్యలోని ఐదవ, ఆరవ
వేతన సంఘాల విరామకాలంలో అధికారిక వినిమయ ధరల సూచికను అనుసరించి పారిశ్రామిక
కార్మికులకు ద్రవ్యోల్బణం రేటు 73శాతం వున్నది. అందుకు భిన్నంగా అదే
సూచికను అనుసరించి 2005-06, 2015-16 మధ్యకాలంలో ద్రవ్యోల్బణం రేటు కనీసం
120 శాతం వుండే అవకాశం వున్నది. వేరే మాటల్లో చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వ
ఉద్యోగుల జీతభత్యాలలో ఏర్పడిన కోతను ఆరవ వేతన సంఘం కంటే ఎక్కువగా ఏడవ వేతన
సంఘం పరిగణనలోకి తీసుకోవలసి వచ్చింది(కరువు భత్యాలు ఇస్తున్నప్పటికీ
వేతనాలలో అలాంటి కోత ఏర్పడుతున్నది).
2005-06, 2015-16 మధ్యకాలంలో
దేశంలోని మొత్తం స్థూల జాతీయోత్పత్తిలో ప్రభుత్వరంగ వేతనాల వ్యయం నిష్పత్తి
పెరగటానికి బదులు తగ్గింది. తరువాతి కాలంలో ద్రవ్యోల్బణం ఎక్కువగా వుండటం
కారణంగా స్థూల జాతీయోత్పత్తితో సాపేక్షంగా చూచినప్పుడు ఆరవ వేతన సంఘం
సూచించినట్టుగా జీతభత్యాల పరిమాణం పెరుగుతుందని ఎవరైనా ఆశిస్తారు. అందుకు
బదులు దానికి పూర్తి విరుద్దంగా జరగటాన్ని మనం గమనిస్తాం. స్థూల
జాతీయోత్పత్తిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల వ్యయ నిష్పత్తిలో
పెరుగుదలశాతం 0.77గా వుండాలని ఆరవ వేతన సంఘం సిఫారసు చేయగా, ఈ పెరుగుదలను
0.65శాతంగా మాత్రమే వుండాలని ఏడవ వేతన సంఘం సిఫారసు చేసింది. అప్పటికీ
ఇప్పటికీ మధ్య స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు మందగించినప్పటికీ ఇలా
జరిగింది. క్లుప్తంగా చెప్పాలంటే ప్రభుత్వ వ్యయం 'మితం'గా వుండాలని ద్రవ్య
పెట్టుబడి చేసే గోలను వేతన సంఘం పట్టించుకున్నది. ఇది నయా ఉదారవాద ప్రభుత్వ
స్వభావం. దానిని అమలు చేయటంకోసం వేతన సంఘం అన్యాయంగా ప్రభుత్వ ఉద్యోగులను
శిక్షించింది.
స్పష్టంగావున్న రెండవ అంశం ఏమంటే ఎక్కువ వేతనాలుగల
ఉద్యోగులపై కంటే తక్కువ వేతనాలుగల ఉద్యోగులపట్ల ఏడవ వేతన సంఘం కఠినంగా
వ్యవహరించింది. గరిష్ట వేతనానికి కనిష్ట వేతనానికి మధ్యగల నిష్పత్తి
పెరుగుదలకు సంబంధించిన సిఫారసులో ఇది స్పష్టంగా కనపడుతున్నది. గతంలోగల
80000 రూపాయల గరిష్ట వేతనాన్ని 2.25 లక్షలకు పెంచారు(క్యాబినెట్
కార్యదర్శికి ప్రతిపాదించిన 2.50 లక్షల వేతనాన్ని విస్మరిద్దాం). గతంలో
6600రూపాయలున్న కనిష్ట వేతనాన్ని 18000 రూపాయలకు పెంచారు. గరిష్టానికి,
కనిష్టానికి మధ్యగల నిష్పత్తి గతంలో 12 రెట్లు వుంటే ప్రస్తుతం 12.5
రెట్లకు పెంచారు. చాలా ఎక్కువగా వున్న ఈ నిష్పత్తిని పెంచటం తిరోగమన చర్యగా
భావించాలి.
కేంద్ర ప్రభుత్వ వేతన చట్ర నిర్మాణంలో జరిగిన
అసమానతలోని ఈ పెరుగుదల ఇతర సమాచారంతో కూడా నిర్థారణ అయింది. ప్రయివేటు గణనల
ప్రకారం వేతన సంఘం నివేదికకు ముందు అన్ని రకాల భత్యాలతో కలిపి ఒక
వ్యక్తికి కనీస వేతనం 15750 రూపాయలు వస్తుంటే అదే వ్యక్తికి నూతన పే
కమిషన్ ప్రకారం 18000 రూపాయలు వస్తుంది. ఇది అతని వేతనంలో 14 శాతం
పెరుగుదల. ప్రస్తుతం మొత్తం వేతనం కం కరువు భత్యం కం పెన్షన్ బిల్లుతో
కేంద్ర ప్రభుత్వం 23.55 శాతం పెంచబోతున్నది. దీనిలో 24 శాతం పెన్షన్లలో
పెరుగుదల వుంటుంది. ఇదంతా అదే ధోరణిలో వుంటుంది. కాబట్టి మొత్తం వేతనాలు కం
కరువు భత్యాలు దాదాపు 24 శాతం పెరుగుతాయి. దీనితో పోల్చినప్పుడు కనీస
వేతనం లభించేవారి జీతభత్యాలలో 14 శాతంగావున్న పెరుగుదల చాలా స్వల్ప
పరిమాణంలో వున్నది. అంటే వేతన సంఘం ఆచరిస్తున్న 'పొదుపు'వల్ల కనీస వేతనం
లభిస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి సగటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికంటే
ఎక్కువగా నష్టపోతున్నాడు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల(రాష్ట్రాలు కూడా
సాపేక్షంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల నిర్మాణాలకు అనుగుణంగా తమ
ఉద్యోగుల వేతనాలను నిర్ణయించే ధోరణి కలిగి వుంటాయి) వాస్తవ జీతభత్యాలు
పెరగకుండా తొక్కిపట్టటం, ఈ జీతభత్యాలలో అసమానతలు తీవ్రం చేయటమనే రెండు
ధోరణులు నయా ఉదారవాద ఆర్థిక వ్యవస్థ తర్కంలో భాగం. ఈ ధోరణులను
ప్రతిఘటించకపోతే అనతికాలంలో పరిస్థితి మరింతగా దిగజారుతుంది.
ఆర్థిక ఉదారీకరణ ప్రభావాలు
దీనికిగల కారణం చాలా సామాన్యమైనది. ఆర్థిక 'ఉదారీకరణ'కు ముందు ప్రయివేటు
రంగ ఎక్జిక్యూటివ్స్ వేతనాల స్థాయిపైన కూడా ప్రభుత్వం నిబంధనలు విధించేది.
ఇది పన్నుల వ్యవస్థద్వారానే కాకుండా ప్రత్యక్ష ఒత్తిడి ద్వారా కూడా
జరిగేది. ఆ రోజుల్లో ఆదాయాలపైన ఉపాంత పన్ను రేటు ఒక స్థాయిని దాటి 100
శాతాన్ని కూడా మించి ఉండేది. నయా ఉదారవాదులు దీనిని ఎగతాళి(ఉపాంత పన్ను
రేటు 100 శాతం కంటే ఎక్కువ ఎలావుంటుంది?!) చేసేవారు. ఇది సంక్షేమ
ప్రభుత్వాల 'అహేతుకత'కు సూచికని వారు అంటుండేవారు. అయితే దీనితో పన్ను
అనంతర ఆదాయాలు ఒక స్థాయిని దాటకుండా వాస్తవంలో ఆదాయాలపై గరిష్ట పరిమితి
వుండేది. పన్ను ఎగవేతలు ఎక్కువగా ఉన్నాయనేదాన్లో సందేహం ఏమీ లేదు.
దానితోపాటు నల్ల ధనం కూడా ఎక్కువగా పోగయ్యేది. కానీ చట్టపరంగా కనీసం
ఆదాయాలపై గరిష్ట పరిమితి ఉండేది.
ఆవిధంగా పన్నుల విధానంతోనే కాకుండా
ఫెరా చట్టంద్వారా కూడా ప్రభుత్వం కార్పొరేట్ రంగానికి చెందిన ఉన్నత
స్థాయి ఎగ్జిక్యూటివ్స్ వేతనాలు పెరగకుండా చూసేది. అనేక రకాల సౌకర్యాలను
కల్పించి ప్రభుత్వ నిబంధనలను కార్పొరేట్లు తుంగలోకి తొక్కటం కూడా
నిస్సందేహంగా నిజం. ప్రభుత్వ ఆలోచనా ధోరణి భిన్నంగా వుండటంవల్ల ఇవి కూడా
నియంత్రించబడేవి. 'ఉదారీకరణ'తో ఈ నియంత్రణలన్నీ కొట్టుకుపోయాయి. క్యాంపస్
సెలెక్షన్స్‌లో ఉద్యోగాలు వచ్చిన ఐఐటి, ఐఐఎమ్ విద్యార్థులకు వార్షిక
జీతాలు 2 కోట్లు, ఆపైన వస్తుంటాయని వార్తా పత్రికలు కథనాలు రాస్తుంటాయి.
అంటే నెలకు 17 లక్షల రూపాయల జీతం అన్నమాట. ఇది దేశంలోని అత్యంత సీనియర్
పౌర అధికారి అయిన క్యాబినెట్ కార్యదర్శి అత్యంత గరిష్టంగా పొందుతున్న
వేతనానికి దాదాపు ఏడు రెట్లు అధికం. అత్యంత సీనియర్ పౌర అధికారి
పొందుతున్న వేతనం కంటే ఐఐటి, ఐఐఎమ్‌ల నుంచి కొత్తగా ఉత్తీర్ణులైన
విద్యార్థులు ఏడు రెట్లు వేతనం పొందటం పూర్తిగా అహేతుకమనేది స్పష్టం.
ప్రయివేటు, ప్రభుత్వ రంగాలలో ఎగ్జిక్యూటివ్‌ల స్థాయిలోగల వేతనాలలో అంతటి
తేడా వుండటంవల్ల ప్రభుత్వాధికారులు 'అవినీతి'కి పాల్పడటానికి (తమ వేతనంలోని
తేడాను సరిచేయటానికి) దారితీయటమో లేక వారు నిరపేక్షంగా అధికారం
చెలాయించటానికి (అలాచేసి అధికారాన్ని చెలాయించటం ఒక 'సౌకర్యం'గా
మార్చుకోవటానికి) దారితీయటమో లేక సామర్థ్యం ప్రభుత్వ రంగం నుంచి ప్రయివేటు
రంగానికి వలస వెళ్లటానికి దారితీయటమో జరుగుతుంది. ఆరోగ్య సంరక్షణ వంటి
ప్రధాన రంగాలలో కొంతకాలంగా అలాంటి వలస ఇప్పటికే జరుగుతోంది. ప్రఖ్యాత
ప్రభుత్వ రంగ సంస్థ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్
సైన్సెస్‌వంటి సంస్థలు అందజేస్తున్న వేతనాలు కూడా ప్రయివేటు వైద్య రంగం
ఇవ్వజూపుతున్న వేతనాలతో పోల్చినప్పుడు నామమాత్రంగానే వుంటున్నాయి. ఇలాంటి
పరిస్థితివల్ల ప్రభుత్వ రంగం నుంచి ప్రయివేటు రంగానికి పెద్ద ఎత్తున వలస
వెళ్లటానికి దారితీయనప్పటికీ ఇది ఎంతోకొంత సామర్థ్యం బయటకు వెళ్ళేలా
చేసింది. ప్రతిష్టాత్మక సంస్థలనుంచి కూడా అలాంటి వలసలుంటే దేశంలోని మారుమూల
ప్రాంతాలలో ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణా సంస్థల పరిస్థితి ఏమిటో ఊహించుకోగలం.
సమర్థ ఉద్యోగులు లేరని ప్రజలు భావిస్తే ఆరోగ్య సంరక్షణ ఇవ్వగలిగే
ప్రభావాన్ని ఈ సంస్థలు చూపజాలవు. కాబట్టి ఎక్కువ మొత్తంలో ఫీజులు
చెల్లించవలసి వచ్చినప్పటికీ రోగులు ప్రయివేటు వైద్య సౌకర్యాలకోసం ఎగబడతారు.
ఆవిధంగా ప్రజల్ని పీడించే ప్రయివేటు వైద్య రంగం మరింత వేగంగా వృద్ధి
చెందుతుంది.
ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఉన్నత స్థాయి
ఉద్యోగులు వలస వెళ్ళకుండా ఆపటానికి ప్రభుత్వం కొంతవరకు వారి జీతభత్యాలను
పెంచే అవకాశం వుంటుంది. నిజానికి అలా ప్రయివేటు రంగానికి వలస వెళ్ళటానికి
అవకాశమున్న ఉద్యోగులను ప్రభుత్వ రంగంలోనే ఉండేలాచేయటానికి కావలసిన
సిఫారసులు చేయాలనేది ఏడవ వేతన సంఘ ఉల్లేఖనా షరతులలో(టర్మ్స్ ఆఫ్
రిఫరెన్స్) ఒకటి. అయితే వేతనాలు చెల్లించటంలో ప్రభుత్వ రంగం ప్రయివేటు
రంగంతో పోటీపడలేకపోయినప్పటికీ ఎక్కువ వేతనాలతో ప్రయివేటు రంగం ఆకర్షించే
ఉద్యోగులను వలస వెళ్ళకుండా చేయటానికి చేసే ప్రయత్నంలో భాగంగా తన వేతన
నిర్మాణాన్ని మరింత అసమంగా వుండేలా చేస్తుంది.
ఇప్పటికే ఈ అసమానత
ప్రయివేటు రంగంలో ఉన్నది. ఈ రంగంలో కొందరికి కోట్ల రూపాయల జీతభత్యాలు
అందుతుంటే ఎంతోమందికి నామమాత్రపు వేతనాలు చెల్లిస్తున్నారు. ప్రభుత్వ
రంగంలో కూడా ఇలాంటి అనమానతను పునరుత్పత్తి చేయటమే నయా ఉదారవాద తర్కం.
కాబట్టి మొత్తంగా వేతనాలు పెరగకుండా చూడటమే దీని లక్ష్యం. దీనికి
కారణమేమంటే ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగులను వలస వెళ్ళకుండా ఆపే ప్రయత్నం
చేయటమంటే ప్రభుత్వ వనరులను ఎక్కువగా ఉపయోగించటమే. అయితే నయా ఉదారవాదంలో
ఎఫ్‌ఆర్‌బిఎమ్ విధానంతోను, కార్పొరేట్-ఫైనాన్షియల్ బూర్జువాలకు దోచి
పెట్టటంద్వారాను ప్రభుత్వ వనరులు ఎటూ కుచించుకుపోతాయి.
ప్రభుత్వ
రంగంలో బాగా వేతనాలున్న ఉద్యోగులు ప్రయివేటు రంగంలోకి వలస వెళ్ళకుండా
ప్రభుత్వం వేతనాలు పెంచాలనిగాని, లేక ఏడవ వేతన సంఘం సిఫారసు చేసినదానికి
ప్రత్యామ్నాయం లేదని నేను చెప్పటంలేదు. విషయం ఏమంటే నయా ఉదారవాద తర్కం
దానిని 'మితవ్యయం', అసమానత దిశలోకి నెడుతుంది. ఈ తర్కాన్ని మనం
ప్రతిఘటించాలి. ప్రజాస్వామ్య సంప్రదాయానికి సరిపడని అనుచిత స్థితికి చేరిన
ప్రయివేటు రంగ వేతనాలను అదుపుచేయటం ఈ ప్రతిఘటనలో భాగమే. అయితే అలాంటి
వేతనాలు ఆర్థిక మిగులు నుంచి వస్తాయి. ఈ మిగులును పెట్టుబడిదారులు ఉన్నత
స్థాయి ఉద్యోగులతో పంచుకుంటారు. ఈ వేతనాలను అదుపుచేయటం ఆవశ్యకంగా అధిక
పన్నులను విధించటంద్వారా ఈ మిగులు పరిమాణాన్ని నియంత్రించటం తో
మొదలవుతుంది.
అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలు కూడా అసమానతలు
పెరగటం గురించి మాట్లాడుతున్నాయి. దీనిని థామస్ పికెట్టి గ్రంథం
ప్రతిబింబించింది. సూపర్ రిచ్ పెట్టుబడిదారులు పాల్గొనే తాజా డావోస్
సమావేశం కూడా వర్తమాన పెట్టుబడిదారీ వ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రధాన
సమస్యల్లో పెరుగుతున్న అసమానత ఒకటని భావించింది. భారతదేశంలోని
ప్రజాభిప్రాయాన్ని ఈ విషయంపై కూడగట్టటానికి ఇదే సరియైన సమయం.
Post your comments on www.facebook.com/aidrdo toa or email to aidrdotoa@gmail.com.
SMS/ WhatsApp to 09440668281
No comments:
Post a Comment