Tuesday 26 July 2016

ఏడవ వేతన సంఘ సిఫారసులకు సర్కారు సమర్థన - ఉద్యోగ సంఘాల పెదవి విరుపు

ఏడవ వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన పెంపు అరకొరగా ఉన్నదని ఉద్యోగ సంఘాలు, పలు రాజకీయ పార్టీలు పెదవివిరిచినా కేంద్రం మాత్రం తన చర్యను సమర్థించుకున్నది. వేతన సవరణల ప్రకారం పెంచిన జీతాలు ఆగస్టు నెల నుంచి ఇవ్వనున్నారు. ఏడవ వేతన సంఘం సూచించిన కనీస వేతన పెంపును గత కమిషన్ల సిఫార్సులతో పోల్చడం సరికాదని ప్రభుత్వం పేర్కొంది. 1996, 2006లో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా వేతనాలను వరుసగా 31 శాతం, 51 శాతం మేర పెంచారని, అయితే ప్రస్తుతం 14.29 శాతం పెంపును ఏడవ వేతన సంఘం సూచించిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అర్జున్‌ రామ్‌ మేఫ్‌ువాల్‌ మంగళవారం (26/07/16) రాజ్యసభలో వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులతో పాటు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏడవ వేతన కమిషన్‌ తన సూచనలను అందించిందని, ప్రస్తుత వేతన పెంపును పది, ఇరవై సంవత్సరాల కిందటి వేతన సిఫార్సులతో పోల్చడం సరికాదని ఆయన చెప్పారు. 


ఈ ఏడాది జనవరి 1 నుంచి ఏడవ వేతన సంఘం సిఫార్సులు అమలవుతాయని ప్రభుత్వం మంగళవారం నోటిఫై చేసింది. దీంతో ఆగస్టు నుంచి పెరిగిన వేతనాలు ఉద్యోగులకు అందనున్నాయి. ఇక బకాయిలు 2016-17 ఆర్థిక సంవత్సరంలో చెల్లిస్తారని నోటిఫికేషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. నూతన వేతన సవరణ ప్రకారం డిసెంబర్‌ 31, 2015 నాటికి ప్రస్తుత మూలవేతనం 2.57 రెట్లు పెరగనున్నది. ప్రారంభ వేతనం రూ 7000 నుంచి రూ 18,000గా నిర్ధారించారు. గరిష్ట వేతనం రూ 2.5 లక్షలకు పెంచారు. అలవెన్సులపై కమిషన్‌ సిఫార్సులను కమిటీకి నివేదించారు. కమిటీ నాలుగు నెలల్లోగా నివేదిక సమర్పించనున్నది. అప్పటివరకూ ప్రస్తుత రేట్లలో అన్ని అలవెన్సులనూ యథాతథంగా కొనసాగిస్తారు. నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ అమలును పటిష్టపరిచేందుకు అవసరమైన సలహాలు అందించేందుకు కమిటీని నియమిస్తారు.

No comments:

Post a Comment